Ticker

6/recent/ticker-posts

మహిళా దినోత్సవ వేడుకల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...*



 *మహిళల సాధికారతే సమాజ పురోగతికి మూలాధారం....*

*కూటమి పాలనలో మహిళాభివృద్ధికి అధిక ప్రాధాన్యత....*

*మహిళా దినోత్సవ వేడుకల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

మహిళలు శక్తి స్వరూపాలని, సృష్టికి మూలం మహిళలేనని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రావులపాలెం కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన డిఎల్ డిఓ రాజేశ్వరరావు,అనపర్తి తెదేపా ఇంచార్జ్ ఆకుల రామకృష్ణ, యువ నాయకులు బండారు సంజీవ్ లతో కలిసి పాల్గొన్నారు. ముందుగా సమావేశానికి వచ్చినవారందరికీ ఎమ్మెల్యే, నాయకులు సాదరంగా ఆహ్వానం పలికారు. మహిళా రైతులు ఏర్పాటు చేసిన సేంద్రియ ఉత్పత్తులను ఎమ్మెల్యే పరిశీలించారు. చిన్నారులతో ఎమ్మెల్యే బండారు ఆత్మీయంగా సంభాషించారు.వారి భవిష్యత్తు ఆలోచనలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నియోజకవర్గంలో నాలుగు మండలాలకు చెందిన వివిధ రంగాల్లో ప్రతిభ చూపుతూ విజయపథంలో నడుస్తున్న 10 మంది మహిళలకు సత్కారం నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. మహిళా పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. మహిళా ఇన్ఫ్లుయెన్సర్లతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తించి గౌరవించుకోవడమే మహిళా దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశమన్నారు. పని గంటలు, వేతనాలపై మహిళా వస్త్ర కార్మికులు 1908లో న్యూయార్క్ వీధుల్లో మొదలు పెట్టిన ప్రదర్శన ఆ తర్వాత మహిళా విప్లవానికి దారితీసిందని, ఐక్యరాజ్యసమితి 1975లో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించిందని తెలిపారు. భారతీయ సంప్రదాయంలో మహిళలకు మొదటి నుంచి సముచిత స్థానం ఉందన్నారు. స్వాతంత్ర పోరాటంలో సైతం ఝాన్సీ లక్ష్మీబాయి, దుర్గాబాయి దేశ్ ముఖ్, సరోజినీ నాయుడు వంటి ఎంతోమంది మహిళలు పోరాటం చేశారని గుర్తు చేశారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకుపోతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. స్త్రీ శక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తుందని, తల్లికి వందనం పథకంతో చదువుకునే విద్యార్థులందరికీ రూ.13వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి డ్వాక్రా సంఘాల ద్వారా ఎమ్ఎస్ఎమ్ఈ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. మహిళలంటే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీకి ఎంతో గౌరవం అన్నారు. అన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక మహిళలకు ఆస్తిలో సమాన వాటా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. డ్వాక్రా సంఘాల అభివృద్ధితో మహిళల స్వయం సమృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేశారని తెలిపారు. వ్యవసాయ వ్యాపార,ఉద్యోగ, సేవా రంగాల్లో మహిళలు ముందడుగు వేస్తున్నారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి హెరిటేజ్ సంస్థను విజయవంతంగా నడిపిస్తూనే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యాభివృద్ధికి సమాజాభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ ఏడాది మహిళా దినోత్సవం సందేశంగా ఒకరికి ఒకరు తోడుగా నిలబడటం అనే సందేశాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారని,మహిళలంతా ఐక్యమత్యంతో ముందుకు సాగినప్పుడు సమాజం పురోభివృద్ధి చెందుతుందని దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గ నాలుగు మండలాలకు సంబందించిన ఎస్హెచ్జీ బ్యాంకు లింకేజీ రుణాలు, స్త్రీ నిధి, ఉన్నతి సంబంధించిన మెగా చెక్కును వారికి అందజేశారు.అనంతరం సమావేశానికి వచ్చిన మహిళామణులందరికీ ఎమ్మెల్యే బండారు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. స్వయంగా ఎమ్మెల్యే భోజనాలు వడ్డించారు.