*మంగళగిరిలో నకిలీ మద్యం కలకలం..*
*ఏపీఎస్‌బీసీఎల్ యాప్‌లో స్కాన్ కాని మద్యం బాటిల్!*
గుంటూరు జిల్లా మంగళగిరిలో నకిలీ మద్యం కలకలం రేపుతోంది. స్థానికంగా ఉన్న లిక్కర్ మార్ట్‌లో విక్రయిస్తున్న మద్యం బాటిల్ ప్రభుత్వ అధికారిక యాప్‌లో స్కాన్ కాకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
మంగళగిరి పట్టణంలోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న లిక్కర్ మార్ట్‌లో ఓ వ్యక్తి బ్లెండర్స్ ప్రైడ్ (Blender's Pride) విస్కీ బాటిల్ కొనుగోలు చేశారు. అనుమానంతో ఆ బాటిల్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను ప్రభుత్వ అధికారిక *APSBCL Consumer Portal* యాప్‌లో స్కాన్ చేయగా "QR Code Not Found / Error" అని చూపించింది.
దీంతో అది కల్తీ, నకిలీ మద్యం అని బాధితుడు ఆరోపిస్తున్నారు. మంగళగిరిలోని లిక్కర్ మార్ట్‌లలో ఇలాంటి నకిలీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీడియోలో హెచ్చరించారు.
నకిలీ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

