Ticker

6/recent/ticker-posts

రాజకీయాల్లో ప్రజాసేవకు కామాలు తప్పఫుల్‌స్టాప్‌లుఉండవు: మంత్రి కందుల దుర్గేష్*సర్పంచ్‌లు గ్రామ స్వరాజ్యానికి వెన్నెముక – నిడదవోలు రూరల్ మండలంలో పదవీ విరమణచేస్తున్న 23 మంది సర్పంచ్‌లకు మంత్రి దుర్గేష్ ఘన సత్కారం**సొంత బలంతో గెలిచి ప్రజా హృదయాలను గెలుచుకున్న వారే సర్పంచ్‌లు అని అభివర్ణన*

 




*రాజకీయాల్లో ప్రజాసేవకు కామాలు తప్పఫుల్‌స్టాప్‌లుఉండవు: మంత్రి కందుల దుర్గేష్*సర్పంచ్‌లు గ్రామ స్వరాజ్యానికి వెన్నెముక – నిడదవోలు రూరల్ మండలంలో పదవీ విరమణచేస్తున్న 23 మంది సర్పంచ్‌లకు మంత్రి దుర్గేష్ ఘన సత్కారం**సొంత బలంతో గెలిచి ప్రజా హృదయాలను గెలుచుకున్న వారే సర్పంచ్‌లు అని అభివర్ణన*

*పదవీ విరమణ కేవలం విరామం మాత్రమే.. ప్రజాసేవ నిరంతరమని పేర్కొన్న మంత్రి దుర్గేష్*

*నిడదవోలు సమగ్ర అభివృద్ధికి అత్యధికంగా రూ. 28 కోట్ల శాస్కి నిధులు రాబట్టానని  మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి*

నిడదవోలు: నిడదవోలు రూరల్ మండలంలోని 23 మంది సర్పంచ్‌ల పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగుస్తున్న సందర్భంగా సమిశ్రగూడెం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ‘ఆత్మీయ అభినందన సభ’లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐదేళ్ల పాటు గ్రామాల అభివృద్ధికి పారదర్శక పాలనతో విశేష సేవలు అందించిన సర్పంచ్‌లను మంత్రి దుర్గేష్ శాలువాలతో సత్కరించి, అభినందన సత్కార జ్ఞాపికలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంలో సర్పంచ్ పదవి అత్యంత కీలకమైనదని  పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీల ప్రభావంతో గెలిస్తే, సర్పంచ్‌లు మాత్రం తమ సొంత బలం, ప్రజలతో ఉన్న మమేకత్వం ద్వారానే ఎంపికవుతారని కొనియాడారు. పార్టీ గుర్తులు లేని ఎన్నికల్లో నెగ్గి, ఐదేళ్ల పాటు నిరాఘాటంగా సేవలందించడం గొప్ప విషయమని ప్రశంసించారు. "రాజకీయాల్లో పదవీ విరమణ అనేది ఉండదు.. కేవలం కామాలు మాత్రమే ఉంటాయి, ఫుల్‌స్టాప్‌లు ఉండవు" అని మంత్రి ఒక సినిమా డైలాగ్‌ను ఉదహరిస్తూ సర్పంచ్‌లలో ఉత్సాహాన్ని నింపారు. ప్రజలు ఆదరించే వరకు ప్రజాసేవ కొనసాగించవచ్చని, పదవీ కాలంలో ఎంతమేర ప్రజల అభిమానాన్ని పొందామన్నదే అసలైన విజయమని పేర్కొన్నారు. ఆత్మపరిశీలన చేసుకుంటే "50 శాతానికి మించి మార్కులు వస్తే సర్పంచ్‌గా మీరు సూపర్ సక్సెస్ అయినట్లే" అని, అది భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందడానికి ప్రాతిపదికగా మారుతుందని ఉత్సాహపరిచారు. కళాకారులకు చప్పట్లే అభినందన అన్నట్లుగా, సర్పంచ్‌లకు ప్రజల అభిమానమే అసలైన గౌరవమని పేర్కొన్నారు.

నిడదవోలు నియోజకవర్గాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో ఉన్న ప్రత్యేక అనుబంధంతో ఇతర నియోజకవర్గాల కంటే ఎక్కువగా రూ. 28 కోట్ల శాస్కి  నిధులను నిడదవోలుకు రాబట్టగలిగామని వివరించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వానికి (2019-24), ప్రస్తుత డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధికి ఉన్న తేడాను గమనించాలని కోరారు. ఈ 21 నెలల కాలంలో నియోజకవర్గంలో గ్రామీణ మరియు ప్రధాన రహదారుల పటిష్టతకు పెద్దపీట వేస్తున్నామని,  భవిష్యత్తులో ఏ పార్టీ సిద్ధాంతాలు నచ్చితే ఆ పార్టీతో ప్రయాణం చేయాలని చెబుతూనే, కూటమి ప్రభుత్వ ఆశయాలను వివరించారు.రాబోయే 3 ఏళ్లలో తానే ఎమ్మెల్యేగా ఉంటానని, మళ్ళీ సర్పంచ్‌లుగా నెగ్గి వచ్చేవారికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తులు లేకుండా జరుగుతాయని, పార్టీ ప్రభావం కంటే అభ్యర్థి స్వంత బలం, వ్యక్తిత్వం, ప్రజలతో ఉన్న సత్సంబంధాలే గెలుపును నిర్ణయిస్తాయని మంత్రి దుర్గేష్ విశ్లేషించారు.ఎంపీ, ఎమ్మెల్యేల కంటే సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్లే స్థానిక ప్రజలకు అత్యంత చేరువగా ఉంటారని గుర్తుచేశారు.మంత్రిగా తనకు వచ్చిన ఈ అవకాశాన్ని నిడదవోలు ప్రగతికి, సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేసేందుకు ఉపయోగిస్తానని చెప్పారు.

ఐదేళ్ల పాటు కష్టపడి పని చేసిన సర్పంచ్‌లు, కొంతకాలం కుటుంబంతో సమయం గడిపి, మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో ప్రజా జీవితంలోకి రావాలని మంత్రి దుర్గేష్ సూచించారు. తాను ఎమ్మెల్యేగా కంటే మీ అందరికీ ఒక సోదరుడిగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని నవ్వుతూ ముగించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కూటమి నాయకులు, ఎంపీడీవో మరియు మండల అధికారులు పాల్గొన్నారు.