Ticker

6/recent/ticker-posts

జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్వద్దప్రమాదాలనియంత్రణకు చర్యలు*రహదారి ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదు**జాతీయ రహదారిపై ఆక్రమణలు, అనధికార కట్టడాలు తొలగించాలి**బస్సులు వంటి భారీ వాహనాల ఫిట్నెస్ పరిశీలించాలి**బస్సులలో అగ్నిప్రమాదాల నివారణకు భద్రతా ఏర్పాట్లు ఉండాలి* *జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ, దెందులూరు ఎమ్మెల్యే తో కలిసి అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్ష*



 






         ఏలూరు, మార్చి , 31 : జాతీయ రహదారిపై ప్రమాదాలు అధికంగా సంభవించే (బ్లాక్ స్పాట్స్) ప్రదేశాలలో ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో మంగళవారం రహదారి భద్రతా కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లతో కలిసి రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రహదారి ప్రమాదాల కారణంగా జిల్లాలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.   ప్రతీ వాహనం ఫిట్నెస్ తో ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన డ్రైవర్ మాత్రమే వాహనం నడిపేలా చూడాలని, డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపకుండా జాతీయ రహదారిపై  పటిష్టమైన నిఘా పెట్టాలన్నారు. జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించి వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు, డ్రైవర్, యజమానులపై  కేసులు నమోదు చేయాలన్నారు.  బస్సులలో అగ్నిప్రమాద నివారణకు భద్రతా ఏర్పాట్లు ఉండేలా పరిశీలించాలన్నారు..  వాహనదారులు హెల్మెట్ వాడకపోవడం, సెల్ఫోన్లు ఉపయోగిస్తూ డ్రైవ్ చేయడం, త్రిబుల్ రైడింగు, రాంగు రూటు డ్రైవింగు, రోడ్ల మలుపు ప్రాంతాలలో ఎక్కువగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోగొట్టు కుంటున్నారని వీటి నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.  చిన్నతనం నుండే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగించాలని, ముఖ్యంగా పాఠశాల,  కళాశాలలు విద్యార్థినీ, విద్యార్థులకు ట్రాఫిక్  నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని అన్నారు. వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా అధిక వెలుగు కలిగిన ఎల్ఈడి లైట్లు   వినియోగం కారణంగా ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బంది కలిగి ప్రమాదాలు జరుగుతున్నాయని,  నిబంధనలకు విరుద్ధంగా అధిక వెలుగు ప్రసరించే ఎల్ఈడి లైట్లు వినియోగించే వారిపై కేసులు నమోదుచేయడంతోపాటు వాటిని అమర్చే షాపు యజమానులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. 

          జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై అనధికార కట్టడాలు, ఆక్రమణల ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాటిని గుర్తించి వెంటనే తొలగించాలన్నారు.  జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు  బస్సులు, లారీలు వంటి భారీ వాహనాలు ఫిట్నెస్ ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఫిట్నెస్ లేని వాహనాలు నడిపితే వాహనం సీజ్ చేయడంతోపాటు, వాహన యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.   ప్రమాద సమయంలో క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనాలు సిద్ధంగా ఉండేలా 108 వాహనాల సిబ్బందితో  సమన్వయము చేసుకోవాలన్నారు.  నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్రాలకు  అధిక శబ్దాలతో కూడిన సైలెన్సర్లు వినియోగించేవారిపై కేసులు నమోదు చేయాలన్నారు.

           దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో జాతీయ రహదారి అలైన్మెంట్ సక్రమంగా లేని కారణంగా కొన్ని చోట్ల రోడ్డు కృంగిపోయి ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని, రహదారి నిర్మాణాన్ని సరిచేయాలని కోరారు. దెందులూరు నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారిలో దెందులూరు-గుండుగొలను మధ్య సర్వీస్ రోడ్డు ఏర్పాటుచేయలేదని, సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారిలో డివైడర్లలో  చెట్లు  నాటి, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత రహదారి నిర్వహణ సంస్ధదని , కానీ నిర్వహణ పనులు చేపట్టడంలేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.  జాతీయ రహదారి నిర్వహణ పనులను సంబంధిత కాంట్రాక్టు ఏజెన్సీ వారి పట్టించుకోవడంలేదని , జాతీయ రహదారి నిర్వహణ పనులు సక్రమంగా సాగేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు.

          ఉప రవాణా కమీషనర్ కరీమ్ మాట్లాడుతూ .  రహదారి ప్రమాదం కారణంగా క్షతగాత్రులకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఆసుపత్రులలో రూ. 1. 50 ల వరకు కాష్ లెస్ ట్రీట్మెంట్ కు అవకాశం ఉందని,ప్రమాదం జరిగిన 72 గంటలలోగా తెలియజేయాల్సి ఉంటుందని చెప్పారు.

            సమావేశంలో ఆర్ అండ్ బి ఎస్ఈ రమేష్, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, డిఎంహెచ్ఓ డా. శోభా, డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, జిల్లా పరిశ్రమల శాఖాధికారి వెంకటరావు, జాతీయ రహదారి సంస్థ అధికారులు, పోలీసు, రవాణా శాఖాధికారులు పాల్గొన్నారు.