ఆంధ్రప్రదేశ్ ఏలూరు, ఏలూరు జిల్లా ఏలూరు,
రాష్ట్రంలో మహిళల ఆర్ధికాభివృద్ధికి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడిఉందని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఏలూరు, దెందులూరు ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. ఏలూరులోని సర్ సీఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఏలూరు దెందులూరు ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, నగర మేయర్ షేక్ నూర్జహాన్, జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ ముఖ్య అతిధులుగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ మహిళల భద్రతాంశం, శాంతి భద్రతల విషయంలో ఎటువంటి రాజీకి ఆస్కారం లేదని, మహిళల భద్రతే ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. మహిళల ఆర్ధిక స్వావలంబన కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలుచేస్తోందన్నారు.
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ... మహిళల ఆర్ధిక, సామాజికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలుచేస్తున్నాయన్నారు. జిల్లాలో అన్ని ప్రధాన పదవుల్లో, స్థానాల్లో మహిళలు కీలకపాత్ర పోషించడం శుభపరిణామమని పేర్కొన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ అన్ని పాత్రల్లో మహిళలు సమర్ధవంతంగా తమ పాత్రను పోషిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, వారి ఆర్ధికాభివృద్ధికి అండగా ఉంటోందని పేర్కొన్నారు. మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ... పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు 245 కోట్ల 42 లక్షల రూపాయల బ్యాంక్ లింకేజ్ రుణాలను అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులను కలెక్టర్ వెట్రి సెల్వి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

