Ticker

6/recent/ticker-posts

మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు! గల్ఫ్ దేశాల అధినేతలకు ప్రధాని ఫోన్


ఇంటర్నెట్ డెస్క్: మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అరబ్ దేశాల అధినేతలతో ఫోన్‌లో చర్చలు జరిపారు. గల్ఫ్ దేశాలపై దాడులు జరుగుతున్న వైనంపై ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి భారతీయుల భద్రత, సంక్షేమంపై కూడా చర్చించారు. ఒమాన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిఖ్, కువైత్ యువరాజు షేఖ్ సబా , ఖతర్ ఎమిర్ షేఖ్ తమీమ్‌లతో ప్రధాని ఫోన్‌లో మాట్లాడారని అధికార వర్గాలు తెలిపాయి.


ఇటీవల బహ్రెయిన్, సౌదీ అరేబియా పాలకులతో కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఈ దాడులు గల్ఫ్ దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. ఈ క్లిష్ట సమయంలో భారత్ గల్ఫ్ పౌరులకు అండగా ఉంటుందని కూడా హామీ ఇచ్చారు. జోర్డాన్ రాజుతో కూడా మాట్లాడిన ప్రధాని మోదీ సంఘీభావాన్ని ప్రకటించారు. యూఏఈ అధ్యక్షుడు, ఇజ్రాయెలీ ప్రధానితో కూడా మాట్లాడి అక్కడి పరిస్థితి గురించి ఆరా తీశారు.

పశ్చిమాసియా, గల్ఫ్ దేశాల్లో సుమారు 90 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇరాన్‌లో 10 వేల మంది చదువు, ఉద్యోగాల కోసం ఉంటుండగా, ఇజ్రాయెల్‌లో 40 వేల మంది భారతీయులు ఉంటున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియా గగనతలం మీదుగా విమానాల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో, అనేక మంది భారతీయులు దుబాయ్, దోహా సహా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఈ విషయమై ఆదివారం కేబినెట్ కమిటీ కూడా సమావేశమై చర్చించింది.