*కే.ఆర్.పురం, అమరావతి విజయహాసం :
.ఆర్.పురం ఐటీడీఏలో ఘనంగా పి4 మొదటి వార్షికోత్సవం – స్వర్ణాంధ్ర విజన్ 2047పై ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
కే.ఆర్.పురం ఐటీడీఏలో పి4 (P4) కార్యక్రమం మొదటి వార్షికోత్సవాన్ని సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే, పి4 ద్వారా అమలు అవుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పి4 కార్యక్రమంలో విశేషంగా సేవలందించిన మార్గదర్శకులు, గ్రామ స్థాయి సిబ్బందిని ఎమ్మెల్యే చేతుల మీదుగా సన్మానించడం జరిగింది. వారి సేవలను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా పని చేయాలని సూచించారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో ముందంజలో నిలిపే దిశగా కూటమి ప్రభుత్వం “స్వర్ణాంధ్ర విజన్ 2047”ను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఈ విజన్ ద్వారా ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం, సంతోషకర జీవనం కల్పించడమే ప్రధాన లక్ష్యమని వివరించారు.
పేదరిక నిర్మూలన, విద్యా ప్రమాణాల పెంపు, వ్యవసాయాభివృద్ధి, గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, మహిళా సాధికారత వంటి అంశాలను ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకొని పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా ఐటీడీఏ పరిధిలోని గిరిజనులకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పి4 కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి, వాటికి త్వరితగతిన పరిష్కారం చూపే విధంగా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి అవసరాలను అర్థం చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం వల్ల సమాజంలో సానుకూల మార్పులు వస్తున్నాయని తెలిపారు.
ఇకపై కూడా ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరేలా అధికారులు కృషి చేయాలని, పారదర్శకంగా సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలు కూడా ప్రభుత్వ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, శాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి, ఐటీడీఏ పీవో రాముల నాయక్, గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణ, బీజేపీ ఎస్టీ మోర్చా నాయకురాలు బొరగం వెంకటలక్ష్మి, పి4 సీవీఏపీ కన్వీనర్ సిహెచ్ శ్రీనివాస్ బాబు, పలువురు ఎంపీడీవోలు, అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


